Chandrababu: ప్రచారం సందర్భంగా ఓ ఇసుక రీచ్ ను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు... సర్కారుపై ఆగ్రహం

  • తిరుపతి ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రచారం
  • ఇసుక అంశాన్ని ప్రస్తావించిన ప్రజలు
  • ఇసుక రీచ్ ను సందర్శించిన చంద్రబాబు
  • ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణ
  • కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆగ్రహం
Chandrababu visits sand mining reach in Tirupati lok sabha constituency

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇసుక రీచ్ ను సందర్శించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ హయాంలో ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇచ్చామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అనేది వైసీపీ నేతలకు దోపిడీ వస్తువులా మారిపోయిందని విమర్శించారు. ఇసుక ప్రజలకు అందకుండా పోయిందని, వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్మకాలు జరుపుతూ కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు.

"తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ఇసుక అంశాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఓ ఇసుక రీచ్ ను స్వయంగా పరిశీలించాను. పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది" అని చంద్రబాబు వెల్లడించారు. అయితే, దీన్ని అరికట్టాల్సిన పోలీసులు వైసీపీ నేతలను వదిలేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన ప్రజలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా వైఖరి దారుణమని అభిప్రాయపడ్డారు.

More Telugu News