SA Bobde: సంస్కృతం జాతీయ అధికార భాష కావాలని అంబేద్కర్ ప్రతిపాదించారు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే

BR Ambedkar Proposed Sanskrit As Official National Language says CJI SA Bobde
  • వాడుక భాష, పని చేసే చోట ఉపయోగించే భాషకు మధ్య సంఘర్షణ ఎప్పటి నుంచో ఉంది
  • దక్షిణాదిన హిందీని, ఉత్తరాదిన తమిళంను అంగీకరించరని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు
  • ఇరు ప్రాంతాల్లో సంస్కృతంపై వ్యతిరేకత తక్కువగా ఉంటుందని భావించారు
  • దేశ ప్రజలకు ఏం కావాలో అంబేద్కర్ కు బాగా తెలుసు
భారత జాతీయ అధికార భాషగా సంస్కృతం ఉండాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతిపాదించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. అరిస్టాటిల్, పర్షియన్ తర్కానికి ప్రాచీన భారత న్యాయశాస్త్రం ఏమాత్రం తక్కువ కాదని చెప్పారు.

అత్యంత మేధావులైన మన పూర్వీకులను మనం పట్టించుకోకపోవడానికి, వారు చెప్పిన వాటి నుంచి మనం లబ్ధి పొందకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని అన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ అకాడెమిక్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యారు.

ఈరోజు అంబేద్కర్ జయంతి కావడంతో ఆయనను జస్టిస్ బాబ్డే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ భాషలో ప్రసంగించాలా? అని ఈ ఉదయం తాను ఆలోచించానని చెప్పారు. మాట్లాడేందుకు ఉపయోగిస్తున్న భాష, పని చేసేటప్పుడు ఉపయోగించే భాషకు మధ్య సంఘర్షణ చాలా పాతదేనని అన్నారు.

 సబార్డినేట్ కోర్టుల్లో ఏ భాష వాడాలనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు అనేక వినతులు వస్తుంటాయని తెలిపారు. ఈ అంశంపై పరిశీలన ఇంకా జరగలేదనేది తన అభిప్రాయమని చెప్పారు. ఈ సమస్యను అంబేద్కర్ ముందే ఊహించారని... సంస్కృతం జాతీయ అధికార భాష కావాలని ఆయన ప్రతిపాదించారని తెలిపారు. ఈ ప్రతిపాదనపై మత పెద్దలు, మౌల్వీలు, పండిట్లతో పాటు అంబేద్కర్ కూడా సంతకం చేశారని చెప్పారు. అయితే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారో? లేదో?  తనకు తెలియదని అన్నారు.

దక్షిణాదిలో హిందీ భాషను వ్యతిరేకిస్తారని, అదే విధంగా ఉత్తరాదిలో తమిళం అంగీకారయోగ్యం కాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారని జస్టిస్ బాబ్డే తెలిపారు. సంస్కృత భాషకు ఉత్తర, దక్షిణాదుల్లో వ్యతిరేకత తక్కువగా ఉండే అవకాశం ఉందని అంబేద్కర్ భావించారని చెప్పారు. అయితే అంబేద్కర్ ప్రతిపాదన విజయవంతం కాలేదని అన్నారు. దేశ ప్రజలకు ఏం కావాలో అంబేద్కర్ కు తెలుసని... అందుకే ఆయన ఈ ప్రతిపాదన చేశారని చెప్పారు.
SA Bobde
CJI
Ambedkar
Sanskrit

More Telugu News