వెల్ డన్ మోదీజీ.. మా సలహాను పాటించారు: కాంగ్రెస్

14-04-2021 Wed 16:40
  • దేశం కోసం కలిసి పని చేయడం మా ప్రాథమిక విధి
  • అహాన్ని పక్కన పెట్టి మీరు దేశానికి ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరం
  • దేశ హితం కోసం ఎంత దూరమైనా వెళ్తాం అన్న కాంగ్రెస్ 
Well done Modi Ji says Congress

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేసింది.

'వెల్ డన్ మోదీ జీ. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సలహాను పాటించారు. దేశ హితం కోసం మేం ఎంత దూరమైనా వెళ్తాం. దేశ ప్రజల ఉన్నతి కోసం కలిసి పని చేయడం మా ప్రజాస్వామిక విధి. అహాన్ని పక్కన పెట్టి దేశానికి ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరం' అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ట్విట్టర్ ద్వారా సోనియాగాంధీ స్పందించారు. 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంతోషకరమని సోనియా అన్నారు. ఇదే నిర్ణయాన్ని 12వ తరగతికి కూడా అమలు చేయాలని కోరారు. విద్యార్థులను జూన్ వరకు ఒత్తిడిలో ఉంచడం సరికాదని అన్నారు. ఈ అంశంపై కేంద్రం తక్షణమే సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు.