Dharmana Krishna Das: టీడీపీని ఆ పార్టీ నేతలే నాశనం చేసుకుంటున్నారు: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

TDP is being destroyed by their own party leaders says Dharmana Krishna Das
  • టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారు
  • ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండేలా లేదు
  • చంద్రబాబు మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు
పరిస్థితి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేలా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆ పార్టీ నేతలే చేతులారా పార్టీని నాశనం చేసుకుంటున్నారని... పార్టీకి భస్మాసురుల్లా మారారని చెప్పారు. టీడీపీ నేతల చేష్టల వల్ల ఆ పార్టీలో ఎవరూ ఉండరని అన్నారు.

ఆ పార్టీలో ఉన్నవారిలో కొందరు బీజేపీలోకి, మిగిలిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారని చెప్పారు. చివరకు ఆ పార్టీలో ఒకరిద్దరూ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండాలని తాము కోరుకుంటున్నామని... అయితే, వారికి ఆ హోదా కూడా ఉండేలా లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే శక్తి టీడీపీకి ఉండదని ధర్మాన చెప్పారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుతం మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ ప్రకటించిందని... ఆ మరుసటి రోజే టీడీపీ నేతలు చాలా సీరియస్ గా ఎన్నికల ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల ఉద్దేశం ఏమిటో కూడా అర్థం కావడం లేదని అన్నారు.

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తుందని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. భయపడి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ రాలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 17వ తేదీ తర్వాత టీడీపీ పని అయిపోతుందని అచ్చెన్నాయుడే చెపుతున్నారని అన్నారు.
Dharmana Krishna Das
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News