తిరుపతి వైసీపీ అభ్యర్థి పోటీకి అనర్హుడు.. కోర్టుకెళతాం: సునీల్ దేవధర్

14-04-2021 Wed 10:06
  • ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు
  • నామినేషన్‌కు ముందు పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారు
  • తనను అవహేళన చేసిన మంత్రి నానిపై ఫైర్
Tirupati YCP candidate to disqualified from contesting says Sunil Deodhar

ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగిన గురుమూర్తి అభ్యర్థిత్వం చెల్లదని బీజేపీ ఏపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకెళతామని అన్నారు. నిన్న తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, గురుమూర్తి ఇప్పటి వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదన్నారు.

నామినేషన్ వేసేముందు ఆయన ఓ పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ తర్వాత తొలగించారని అన్నారు. గురుమూర్తి మతం మారిన విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నోరెందుకు మెదపడం లేదని దేవధర్ ప్రశ్నించారు. గోవిందనామాలు పెట్టుకున్న తనను మంత్రి పేర్ని నాని అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి నామాలు డ్రామాలాగా కనిపిస్తున్నాయా? అని మండిపడ్డారు.