లోకేశ్ గురించి అచ్చెన్నాయుడు నిజమే మాట్లాడారు: బొత్స

13-04-2021 Tue 19:57
  • లోకేశ్ పై అచ్చెన్న వ్యాఖ్యలు అంటూ ఓ వీడియో వైరల్
  • స్పందించిన బొత్స
  • తాము  మీడియా ముందు విమర్శిస్తామన్న బొత్స
  • అచ్చెన్న నాలుగ్గోడల మధ్య చెప్పాడని వివరణ
Botsa opines on Atchannaidu comments about Nata Lokesh

టీడీపీ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గురించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలు వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. లోకేశ్ గురించి అచ్చెన్నాయుడు నిజమే మాట్లాడారని అన్నారు. తాము మీడియా ముందు మాట్లాడే విషయాన్ని అచ్చెన్న నాలుగు గోడల మధ్య చెప్పారని బొత్స వివరించారు. లోకేశ్ గురించి మీడియా ముందు మాట్లాడలేడు కాబట్టే టీడీపీ నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నాడని భావిస్తున్నామని పేర్కొన్నారు.

అటు, చంద్రబాబు-రాళ్ల దాడి అంశంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీకి డిపాజిట్ దక్కదని చంద్రబాబు ముందుగానే ఊహించారని, అందుకే,  రాళ్ల దాడి చేశారంటూ కొత్త డ్రామాకు తెరలేపాడని ఆరోపించారు.

ఈ సందర్భంగా బొత్స జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా స్పందించారు. బీజేపీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని తెలిసే పవన్ కల్యాణ్ క్వారైంటన్ కు వెళ్లారని అభిప్రాయపడ్డారు.