టీకా కొరతను అధిగమించే దిశగా కేంద్రం కీలక అడుగులు

13-04-2021 Tue 19:26
  • విదేశీ టీకాలను అనుమతించే యోచన
  • వ్యాక్సినేషన్‌ వేగవంతానికి దోహదం
  • ఈ ఏడాది మరో 5 వ్యాక్సిన్ల అనుమతికి అవకాశం
  • ఈ నెలాఖరుకు అందుబాటులోకి స్పుత్నిక్‌-వి టీకా
Centre has taken key decision to overcome vaccine shortage

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ టీకాల కొరతను అధిగమించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల జాబితాలో మరికొన్నింటిని చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఫలితంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా అందించాలని భావిస్తోంది.

విదేశాల్లో అనుమతి పొంది.. ఇప్పటికే అక్కడ వినియోగంలోకి వచ్చిన టీకాలను భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద అనుమతించాలని వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్ జాన్సన్‌ వంటి టీకా తయారీ సంస్థలు భారత్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నట్లు నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వి.కె.పాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు విదేశాల్లో రూపొందించిన టీకాలకు భారత్‌లో అనుమతి లభించాలంటే ఇక్కడ రెండు, మూడు దశల ప్రయోగాలు నిర్వహించడం తప్పనిసరి. అయితే, తాజాగా దీన్ని పక్కబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ టీకా డోసులు పరిమిత సంఖ్యలో అందుబాటులోకి వస్తాయని నిపుణుల కమటీ ఛైర్మన్‌ వి.కె.పాల్‌ తెలిపారు.

అలాగే మరో ఐదు వ్యాక్సిన్లకు ఈ ఏడాది అనుమతి అభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌(బయో ఈ), జైడస్‌ క్యాడిలా, నొవావ్యాక్స్‌, ముక్కు ద్వారా వేసే భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాలు టీకాల కొరత ఉందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఏకంగా కొన్ని టీకా కేంద్రాలను మూసివేశారు. మరోవైపు కేరళలో మరో మూడు రోజుల్లో కరోనా టీకా డోసుల నిల్వలు నిండుకోనున్నాయని తెలుపుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్రానికి సోమవారం లేఖ రాశారు.