రద్దీ ప్రదేశాల్లో డబుల్ మాస్క్ వల్ల ప్రయోజనం ఉంటుందన్న నిపుణులు!

13-04-2021 Tue 16:03
  • కరోనా నివారణలో కీలకంగా మాస్కు
  • రెండు మాస్కులు వేసుకుంటే మరింత రక్షణ!
  • వైరస్ చొరబడే అవకాశాలు తగ్గుతాయన్న నిపుణులు
  • ఇది ప్రామాణికమేమీ కాదంటున్న మరికొందరు నిపుణులు
Experts opines on double mask to tackle corona

కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి అని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే, రద్దీ ప్రదేశాల్లో డబుల్ మాస్కు ధరించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక మాస్కుపై మరో మాస్కు ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని, రెండు మాస్కులు ధరించాలన్న సలహా సరైనదేనని పేర్కొన్నారు. రెండు మాస్కుల విధానంలో వైరస్ చొరబడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు.

అయితే, డబుల్ మాస్కు విధానంలో ఒక సర్జికల్ మాస్కు, ఒక క్లాత్ మాస్కు... లేకపోతే రెండు క్లాత్ మాస్కులు అయినా ధరించవచ్చని, కానీ రెండు ఎన్95 మాస్కులు ధరించరాదని ఢిల్లీకి చెందిన డాక్టర్ రోమెల్ టికూ అనే వైద్య నిపుణుడు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం సాధ్యంకాని పరిస్థితుల్లో డబుల్ మాస్కు వేసుకుని వెళ్లడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. చాలామంది మాస్కును సరిగా ధరించరని, అలాంటి వాళ్లు డబుల్ మాస్కు విధానం వల్ల లబ్ది పొందుతారని మరో నిపుణుడు తెలిపారు. కరోనా రోగుల తుంపరల నుంచి డబుల్ మాస్కు విధానం వల్ల రక్షణ పొందుతారని పేర్కొన్నారు.

మరికొందరు నిపుణులు మాత్రం ఇదేమంత ప్రామాణిక విధానం కాదని అంటున్నారు. ఒక్క మాస్కునే సరైన విధానంలో ధరిస్తే ఎలాంటి సమస్య ఉండదని బెంగళూరు అపోలో ఆసుపత్రి నిపుణుడు డాక్టర్ రవీంద్ర మెహతా తెలిపారు.