సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి.. కరోనా ఫోర్త్ వేవ్ దారుణంగా ఉంది: కేంద్రాన్ని కోరిన కేజ్రీవాల్

13-04-2021 Tue 15:18
  • ఒక్క రోజులోనే 13,500 కేసులు నమోదయ్యాయి
  • ఫోర్త్ వేవ్ సందర్భంగా భయానక పరిస్థితులను చూస్తున్నాం
  • బోర్డు పరీక్షలు నిర్వహిస్తే కరోనా భారీగా విస్తరిస్తుంది
Kejriwal urges Center to cancel CBSE exams

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే ఏకంగా 13,500 కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య 7,36,788కి పెరిగాయి. ఈ నేపథ్యంలో, సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారు.

గత 24 గంటల్లో ఢిల్లీలో 13,500 కరోనా కేసులు నమోదయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు. నవంబర్ లో థర్డ్ వేవ్ సందర్భంగా ఒక్క రోజే 8,500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఫోర్త్ వేవ్ సందర్భంగా భయానక పరిస్థితులను అందరం చూస్తున్నామని తెలిపారు. ఫోర్త్ వేవ్ లో పిల్లలు, యువత దారుణంగా ప్రభావితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలను రాయబోతున్నారని... లక్ష మంది ఉపాధ్యాయులు డ్యూటీలో ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు పరీక్షలను నిర్వహిస్తే... కరోనా వైరస్ దారుణంగా విస్తరిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఉత్తీర్ణతను పరీక్షల ద్వారా కాకుండా... ఆన్ లైన్ పరీక్షల ద్వారా, లేకుంటే ఇంటర్నల్ అసెస్ మెంట్ ద్వారా నిర్ణయించాలని సూచించారు. బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేజ్రీవాల్ సూచించారు. తక్కువ కరోనా లక్షణాలు ఉన్నవారు ఇళ్ల వద్దే క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో డాక్టర్లు కూడా సహకరించాలని అన్నారు. ఢిల్లీలో కోవిడ్ బెడ్ల సంఖ్యను పెంచామని... 14 ప్రైవేటు ఆసుపత్రులను పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చామని తెలిపారు.