'ఉగాది' కానుకగా 'నారప్ప' స్పెషల్ పోస్టర్

13-04-2021 Tue 14:02
  • వెంకటేశ్ నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం
  • గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ
  • భూమి కోసం ఓ సాధారణ రైతు చేసే పోరాటం    
Naarappa Special Poster For Ugadi

వెంకటేశ్ తన కెరియర్ మొదటి నుంచి కూడా రీమేక్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అలా ఆయన చేసిన సినిమాలలో విజయవంతమైనవాటి సంఖ్యనే ఎక్కువ. ఆయన తాజా చిత్రంగా రానున్న 'నారప్ప' కూడా రీమేక్ నే. తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్'కి ఇది రీమేక్. తమిళంలో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. వైవిధ్యభరితమైన ఆ సినిమాను 'నారప్ప' టైటిల్ తో రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన ప్రియమణి నటించింది.


'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. నారప్ప తన భార్యాబిడ్డలతో కలిసి ఎక్కడికో బయల్దేరినట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. తెల్లరంగు లుంగీ .. చొక్కా .. కండువాతో వెంకటేశ్ మెరిసిపోతున్నాడు. ఓ సాధారణమైన పల్లెటూరి ఇల్లాలిగా ప్రియమణి ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ పోస్టర్ .. 'ఉగాది' ఉత్సాహాన్ని తెస్తోంది. కష్టజీవి .. నిజాయితీపరుడైన ఒక రైతు తన భూమిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడనేదే ఈ సినిమా కథ. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.