Swaroopanandendra Saraswati: ఓ పెద్ద నేతకు ఇబ్బంది ఉంటుంది.. జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి: స్వరూపానందేంద్ర
- ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందని కోరుకుందాం
- రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది
- ఏపీకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా శారదాపీఠంలో ఈరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గంటల పంచాంగాన్ని స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని కోరుకుందామని అన్నారు. ప్లవ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడమని చెప్పారు. గ్రహాల అనుకూలతలు లేకున్నా ఇరు తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని స్వరూపానందేంద్ర జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ల జాతకాలు బాగున్నాయని తెలిపారు. ఏపీకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండబోవని చెప్పారు.
స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇబ్బందులు ఎదుర్కోబోతున్న ఆ పెద్ద నేత ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. ఆ నేత ఉత్తరాది వారా? దక్షిణాది వారా? లేదా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.