మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: డబ్ల్యూహెచ్ఓ 

12-04-2021 Mon 22:53
  • కరోనాను ఎదుర్కోవడంలో గందరగోళం ఉందన్న టెడ్రోస్‌‌ అధనామ్‌
  • పటిష్ఠ చర్యల ద్వారా కొన్ని నెలల్లో నియంత్రించొచ్చు
  • ఏడు వారాలుగా పెరుగుతున్న కేసులు
  • గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి
Long way to end pandemic WHO director general

కరోనాను ఎదుర్కోవడంలో ఉన్న గందరగోళం, అలసత్వాన్ని బట్టి చూస్తే మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. అయితే, పటిష్ఠమైన వైద్యారోగ్య చర్యల ద్వారా కొన్ని నెలల వ్యవధిలో దీన్ని నియంత్రించగలమని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి రెండు నెలల గణాంకాలు చూస్తే... మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దీంతో వైరస్‌ను నియంత్రించగలమని.. వేరియంట్లను అడ్డుకోగలమన్న విషయం స్పష్టమైందన్నారు.

గత ఏడు వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. ప్రస్తుతం కీలక దశలో ఉన్నామని పేర్కొన్నారు. గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఇంకా నైట్‌ క్లబ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఇక కొంతమంది తాము యువకులం కాబట్టి కరోనా సోకినా ఏమీ కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.