మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారు: మమతా బెనర్జీ

12-04-2021 Mon 18:10
  • ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు
  • అమెరికాకు వెళ్లి ట్రంప్ కార్డు వాడారు.. ఇప్పుడు బెంగాల్ కార్డు వాడుతున్నారు
  • బీజేపీ మాటనే ఈసీ వింటోంది
Modi crossing limits says Mamata Banerjee

ప్రధాని మోదీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని... ఇలాంటి ప్రధానిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలకు తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు. బెంగాల్ అభివృద్ధి కోసం తాను ఏం చేయలేదో చెప్పాలని మోదీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం తాను శ్రమిస్తున్నానని చెప్పారు. ట్రంప్ ను గెలిపించడానికి మోదీ అమెరికాకు వెళ్లి, ట్రంప్ కార్డును ప్లే చేశారని... ఇప్పుడు పశ్చిమబెంగాల్ కు వచ్చి బెంగాల్ కార్డును వాడుతున్నారని విమర్శించారు.

జీజేపీ నేతలు చెపుతున్న మాటలనే ఎన్నికల కమిషన్ వింటోందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మాటలనే కాకుండా, అందరి మాటలను వినాలని ఎన్నికల సంఘాన్ని చేతిలెత్తి కోరుతున్నానని అన్నారు. ఎన్నికల సంఘానికి పక్షపాతం ఉండకూడదని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు బెంగాల్ లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని... అలాంటి వాళ్లను జైళ్లలో పెట్టాలని అన్నారు. రాజకీయాల నుంచి అలాంటి వాళ్లను తొలగించాలని మండిపడ్డారు. కాంగ్రెస్, వామపక్షాలు బీజేపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.