ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇవిగో!

11-04-2021 Sun 22:32
  • దాదాపు గంటన్నరపాటు కేటీఆర్ చిట్ చాట్
  • అనేక అంశాలపై ప్రశ్నించిన నెటిజన్లు
  • ఒపిగ్గా బదులిచ్చిన కేటీఆర్
  • తమన్ కూడా ఓ నెటిజన్ లా చిట్ చాట్ చేసిన వైనం
KTR ChitChat in Twitter

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు అందరికీ బదులిచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. కొందరు తమ సమస్యలను ప్రస్తావించగా, వారికి కూడా హామీ ఇచ్చారు.

కేటీఆర్ కు నెటిజన్లు సంధించిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన జవాబులు ఇవిగో...

ప్రశ్న: మీ ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ ఎవరు?
కేటీఆర్: రాహుల్ ద్రావిడ్... ఇప్పటితరంలో విరాట్ కోహ్లీ.

ప్రశ్న: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా ఎలా ఉంది?
కేటీఆర్: నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది.

ప్రశ్న: 2021లో తెలంగాణలో కరోనా కేసులు తీవ్రంగా వస్తున్నాయి... లాక్ డౌన్ విధిస్తారని భావించవచ్చా?
కేటీఆర్: లాక్ డౌన్ విధించడం ఏమంత మంచి ఆలోచన అని నేననుకోవడంలేదు.

ప్రశ్న: ఇటీవల చూసిన చిత్రం?
కేటీఆర్: జాతిరత్నాలు... ఎంతో ఆస్వాదించాను.

ప్రశ్న: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది?
కేటీఆర్: ఏదేమైనా చివరికి ప్రజాస్వామ్యమే గెలుస్తుంది.

ప్రశ్న: మీరు హీరోలాగా కనిపిస్తారు... బాలీవుడ్, హాలీవుడ్ లో ఎప్పుడూ ప్రయత్నించలేదా?

కేటీఆర్: బాలీవుడ్డు, హాలీవుడ్డా... మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్!

ప్రశ్న: పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉందా?
కేటీఆర్: మీరు ఈ ప్రశ్నను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడగాలి.

ప్రశ్న: కేటీఆర్ సర్ మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా?
కేటీఆర్: ఇంకా తీసుకోలేదు.

కాగా ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఓ పాట చేస్తే బాగుంటుందని, మంచి గాయకులు, సంగీతకారులతో చేయాలనుకుంటున్నానని తమన్ పేర్కొన్నారు. అందుకు కేటీఆర్ బదులిస్తూ... అద్భుతమైన ఆలోచన బ్రదర్ అంటూ ప్రోత్సహించారు.

ప్రశ్న: కేటీఆర్ సర్ ఉప ఎన్నికల తర్వాత ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడతాయని ఆశించవచ్చా?
కేటీఆర్: అవును.

ప్రశ్న: రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అన్నది నిజామాబాద్ రైతుల దీర్ఘకాల స్వప్నం. ఎప్పుడొస్తుంది సర్?
కేటీఆర్: పసుపు బోర్డు వస్తుందని బాండ్ పేపర్ రాసిచ్చిన జెంటిల్మన్ ను అడగండి.

ప్రశ్న: నాగార్జునసాగర్ లో ఎవరు గెలుస్తారో మీ ఆలోచనలు పంచుకుంటారా?
కేటీఆర్: నాగార్జునసాగర్ ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్సే గెలుస్తుంది. గతంలో ప్రాతినిధ్యం వహించిన నాయకుడు జానారెడ్డికి, భవిష్యత్తులో నాయకత్వం వహించబోయే యువ నాయకుడు భగత్ కు మధ్య పోటీ ఇది.