నవగ్రహాల చుట్టూ తిరిగినా మీ పాపాలు పోవు: చంద్రబాబు

11-04-2021 Sun 21:52
  • తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి
  • ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత
  • నెల్లూరు జిల్లాలో రోడ్ షోలు
  • నవ మోసాలు చేశారని ఆగ్రహం
Chandrababu roadshow in Nellore district

తిరుపతి పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదని స్పష్టం చేశారు. తాము బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే సీఎం జగన్ 25 శాతానికి తగ్గించాడని ఆరోపించారు. బీసీలంటేనే జగన్ కు గిట్టదని అన్నారు.

నవరత్నాలు అంటూ నవమోసాలు చేశారని విమర్శించారు. నవ గ్రహాల చుట్టూ తిరిగినా వీళ్ల పాపాలు పోవని స్పష్టం చేశారు. జగన్ రెడ్డిని చరిత్ర క్షమించదని అన్నారు. తిరుపతికి రాకుండా జగన్ పారిపోయాడని, ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుందని సభ వాయిదా వేసుకున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ఓటేస్తే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్టేనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోందని, ఇప్పటికీ గతంలో తాము చేసిన అభివృద్ధే కనిపిస్తోందని అన్నారు.