రాణించిన రైనా, శామ్ కరన్... చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 7 వికెట్లకు 188 రన్స్

10-04-2021 Sat 21:28
  • ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ చెన్నై
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • రైనా అర్ధసెంచరీ.. చివర్లో ధాటిగా ఆడిన శామ్ కరన్
  • క్రిస్ వోక్స్, ఆవేశ్ ఖాన్ లకు రెండేసి వికెట్లు
Delhi Capitals to chase huge target against Chennai Super Kings

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54), శామ్ కరన్ (34) అదరగొట్టారు. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి చెన్నైకి బ్యాటింగ్ అప్పగించింది.

అయితే, చెన్నై 7 పరుగులకే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ (36) జోడీ ఎడాపెడా షాట్లు బాదడంతో స్కోరు ఊపందుకుంది. ఆ తర్వాత అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (26) కూడా వేగంగా పరుగులు సాధించారు.

ఓ దశలో చెన్నై 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా శామ్ కరన్ ధాటిగా ఆడడంతో చెన్నై భారీస్కోరు సాధించింది. 15 బంతులు ఎదుర్కొన్న శామ్ కరన్ 4 ఫోర్లు, 2 భారీ సిక్సులతో అలరించాడు. వాటిలో ఒకటి తన సోదరుడు టామ్ కరన్ బౌలింగ్ లో బాదాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, టామ్ కరన్ లకు చెరో వికెట్ లభించింది.