Vakeel Saab: వకీల్ సాబ్ టికెట్ల ధరలు పెంచొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

AP High Court orders do not hike Vakeel Saab ticket rates
  • వకీల్ సాబ్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్
  • కానీ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలకు నిరాశ
  • టికెట్ రేట్లు పెంచితే కఠినచర్యలు తప్పవన్న ఏపీ సర్కారు
  • హైకోర్టుకు చేరిన వ్యవహారం
  • సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్
పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన వకీల్ సాబ్ చిత్రానికి ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా, టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు లేకపోవడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం చూపనుంది.

తాజాగా వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు కొట్టివేసింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికే ఆన్ లైన్ లో ఆదివారం వరకు బుక్ అయిన టికెట్లకు వర్తించదని పేర్కొంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించిన వకీల్ సాబ్ చిత్రం నిన్న రిలీజ్ అయింది. కానీ ఏపీ సర్కారు వకీల్ సాబ్ చిత్ర ప్రదర్శకులకు నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలు ప్రదర్శించరాదని, టికెట్ రేట్లు పెంచవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచితే కఠినచర్యలు తప్పవంటూ ఓ జీవో కూడా తీసుకువచ్చింది.

దాంతో వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Vakeel Saab
Ticket Rates
AP High Court
Andhra Pradesh
Pawan Kalyan

More Telugu News