Telangana: టెన్త్ పరీక్షలపై మల్లగుల్లాలు పడుతున్న తెలంగాణ సర్కారు!

  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • గత సంవత్సరం అందరూ పాస్
  • ఈ సంవత్సరం కూడా అదే చేయాలన్న ఆలోచన
  • మరికొన్ని రోజులు చూసి తుది నిర్ణయం తీసుకోనున్న అధికారులు
Telangana Govt Re thinks about Tenth Exams

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయమై విద్యా శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను మాత్రం నిర్వహించాల్సిందేనని భావిస్తున్న అధికారులు, తొలి సంవత్సరంతో పాటు, టెన్త్ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. కనీస మార్కులతో పాస్ అయినట్టుగా ప్రకటిస్తే సరిపోతుందని పలువురు అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

వాస్తవానికి వచ్చే నెల 17 నుంచి టెన్త్ పరీక్షలు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం కేసులు పెరుగుతున్న స్థితిని పరిశీలిస్తే మాత్రం, వార్షిక పరీక్షలు అవసరమా? అన్న తర్జనభర్జనలో ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఫైనల్ ఎగ్జామ్స్ రద్దు చేసి, అందరినీ పాస్ చేయాలన్న ఆలోచనలో విద్యా శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. 2019-2020 విద్యా సంవత్సరంలో ఫార్మేటివ్ అసెస్ మెంట్స్, సమ్మేటివ్ అసెస్ మెంట్ పరీక్షలు జరుగగా, వాటిని పరిగణనలోకి తీసుకుని, ఇంటర్నల్ మార్కులతో విద్యార్థులకు కేటాయించి, ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సంవత్సరం ఆ పరీక్షలు కూడా జరుగలేదు. అయితే, ఈ నెలాఖరు వరకూ పరిశీలించి, కరోనా కేసుల వ్యాప్తిపై సమీక్షించి, మే నెల తొలివారంలో ఈ విషయమై తుది నిర్ణయం ప్రకటించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కేసులు తగ్గితే, పరీక్షలను షెడ్యూల్ ప్రకారం జరిపించాలని, లేకుంటే రద్దు చేయడమే మేలని ఉన్నతాధికారులు అంటున్నారు. ఇదే సమయంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ చేయాలని విద్యా శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News