కరోనా ఎఫెక్ట్ తో 'లవ్ స్టోరీ' రిలీజ్ వాయిదా?

08-04-2021 Thu 18:35
  • చైతూ - సాయిపల్లవి జోడీగా 'లవ్ స్టోరీ'
  • అంచనాలు పెంచిన 'సారంగధరియా' సాంగ్
  • ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ ఈ నెల 16  
Love Story release date is postponed

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ప్రేమ తత్త్వాన్ని సుకుమారంగా టచ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాల్లోని మాటల్లోను .. పాటల్లోను సున్నితమైన భావజాలం ఉంటుంది. అది మనసులను ముడివేసుకుంటూ .. హృదయాలను పెనవేసుకుంటూ వెళుతుంది. అందువల్లనే ఆయన సినిమాలను యూత్ విపరీతంగా ఇష్టపడుతుంది. ఆ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లను కూడా వరుసబెట్టి రాబడుతుంటాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా తెరకెక్కించిన కథే 'లవ్ స్టోరీ'. చైతూ - సాయిపల్లవి కలిసి నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది.  

రామ్మోహన్ రావు - నారాయణ దాస్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 16వ తేదీన విడుదల చేయాలని  నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కరోనా తీవ్రత కారణంగా కొంతకాలం పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని వాళ్లు భావించినట్టుగా చెప్పుకుంటున్నారు. 'సారంగధరియా ..' పాట వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై  అంచనాలు పెరిగిపోయాయి. రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్న సమయంలో ఈ టాక్ రావడం విచారించదగిన విషయమే.