రమణ దీక్షితులకు జగన్ లో దేవుడు కనిపిస్తే తిరుమల వెంకన్నను వదిలి ఆయన్నే సేవించుకోవాలి: విష్ణువర్ధన్ రెడ్డి

08-04-2021 Thu 15:21
  • జగన్ ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు
  • ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నాడని కితాబు
  • రమణ దీక్షితులపై విపక్ష నేతల విసుర్లు
  • రమణ దీక్షితులు రాజీనామా చేయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Vishnu Vardhan Reddy fires on TTD high priest Ramana Deekshitulu

ఏపీ సీఎం జగన్ ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన విష్ణుమూర్తిలా కనిపిస్తున్నాడని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. మనుషులను దేవుళ్లతో పోల్చడం చాలా తప్పు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హితవు పలికారు. ఈ అంశంలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కాస్తంత ఘాటుగానే స్పందించారు. రమణ దీక్షితులకు జగన్ లో దేవుడు కనిపిస్తే తిరుమల వెంకన్నను వదిలి ఆయననే సేవించుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు.

జగన్ ను మహావిష్ణువుతో పోల్చుతూ ఆయనే సర్వస్వం అని భావించుకుంటున్న రమణ దీక్షితులకు... తిరుమలలో వెలిసిన కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వద్ద ప్రధాన అర్చకుడిగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై రమణ దీక్షితులు తక్షణమే టీటీడీ ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.