నాకు న్యాయం చేయండి... పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ వినోద్

08-04-2021 Thu 14:53
  • ఇంటి యజమానిపై ఫిర్యాదు
  • ఇల్లు అమ్ముతానని రూ.40 లక్షలకు డీల్
  • అడ్వాన్సుగా రూ.13.40 లక్షలు ఇచ్చిన వినోద్
  • రూ.40 లక్షల కంటే ఎక్కువ సొమ్ము ఇవ్వాలన్న యజమాని
  • పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వినోద్
  • తాజాగా ఈస్ట్ జోన్ డీసీపీకి వినతిపత్రం
Jabardast fame Vinod complains to East Zone DCP

జబర్దస్త్ కార్యక్రమంలో అమ్మాయి వేషంలో అద్భుతంగా నటిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వినోద్ ఓ వివాదంలో పోలీసులను ఆశ్రయించాడు. జబర్దస్త్ వినోద్ గతంలోనూ ఓసారి ఇంటి యజమాని దాష్టీకంపై కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పట్లో వినోద్ పై దారుణమైన రీతిలో దాడి జరిగింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసినా కాచిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డికి మొరపెట్టుకున్నాడు.

ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తానని చెప్పిన యజమాని తన నుంచి రూ.13.40 లక్షలు అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాడని వినోద్ వెల్లడించాడు. రూ.40 లక్షలకు ఇంటి బేరం కుదిరిందని, అయితే, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెల్లిస్తేనే ఇంటిని అమ్ముతానని, లేకపోతే అడ్వాన్స్ కూడా తిరిగివ్వనని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని జబర్దస్త్ వినోద్ డీసీపీకి వినతిపత్రం అందించాడు.