న్యాయస్థానాల తీర్పులపై మా పార్టీకి అమితమైన గౌరవం ఉంది: వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

07-04-2021 Wed 16:36
  • రేపు ఏపీలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు
  • లైన్ క్లియర్ చేసిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్
  • కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న లేళ్ల అప్పిరెడ్డి
  • వైసీపీ విజయం ఖాయమని వ్యాఖ్యలు
Lella Appireddy said YCP welcomes high court division bench verdict

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు హైకోర్టు డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పందించారు. న్యాయ వ్యవస్థలపై తమకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వైసీపీ స్వాగతిస్తోందని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలు, చట్టాల పట్ల నమ్మకంతో ముందుకు వెళుతున్నామని అప్పిరెడ్డి ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే ఓ వెన్నుపోటు అని విమర్శించారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు బహిష్కరించడం ద్వారా తన చేతగానితనాన్ని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. రేపటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని అన్నారు.