సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ క్షేమం... ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు

07-04-2021 Wed 16:12
  • చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
  • గల్లంతైన రాకేశ్వర్ సింగ్ అనే కమాండో
  • తమ అధీనంలోనే ఉన్నాడని మావోల ప్రకటన
  • తాజాగా ఫొటో విడుదల
  • తాటాకు పాకలో సేదదీరుతున్న కమాండో
 Naxals releases latest photo of commando Rakeshwar Singh

ఇటీవల చత్తీస్ గఢ్ లోని బీజాపూర్-సుక్మా అటవీప్రాంతంలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో రాకేశ్వర్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో గల్లంతైన సంగతి తెలిసిందే. రాకేశ్వర్ సింగ్ తమ అధీనంలోనే ఉన్నాడని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నాడంటూ ఓ ఫొటోను విడుదల చేశారు.

ఓ చిన్న తాటాకుల పాకలో విశ్రాంతి తీసుకుంటున్న కమాండో ఆ ఫొటోలో దర్శనమిచ్చాడు. రాకేశ్వర్ సింగ్ ఎవరితోనో మాట్లాడుతుండగా ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. అతడి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించకపోవడాన్ని బట్టి మావోలు బాగానే చూసుకుంటున్నారని తెలుస్తోంది. పోలీసులు తమ శత్రువులు కారని, ప్రభుత్వ విధానాలనే తాము వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.