Railway Bridge: భారతీయ రైల్వే అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆర్చ్ నిర్మాణం పూర్తి

  • జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున వంతెన
  • ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు అధికం
  • కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలతో కలపనున్న బ్రిడ్జి
Arch Of Worlds Highest Railway Bridge In Jammu And Kashmir Completed

భారతీయ రైల్వే చరిత్రలో నిన్న ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో 1.3 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్‌బీఆర్ఎల్‌) ప్రాజెక్టులో భాగంగా రూ. 1486 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టారు. కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలతో ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుంది.

బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా నిన్న అత్యంత క్లిష్టమైన ఆర్చ్ నిర్మాణం పూర్తికాగా, మరో రెండున్నరేళ్లలో రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు. కాగా, నిన్న ఆర్చ్ నిర్మాణంలోని ప్రధానమైన ముగింపు ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, కొంకణ్ రైల్వే చైర్మన్ సంజయ్ గుప్తా వీక్షించారు.

పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైన ఈ బ్రిడ్జి నిర్మాణం మరో ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉత్తర రైల్వేకు ఇదో చారిత్రాత్మక రోజని, యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టును పూర్తిచేయడంలో ఇదో మైలురాయి అని అశుతోష్ గంగాల్ పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు.

బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. ఆర్చ్ మొత్తం బరువు 10,610 టన్నులు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాలను కూడా ఈ వంతెన తట్టుకుంటుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి నిర్మాణం ఇదే తొలిసారని గంగాల్ పేర్కొన్నారు.

More Telugu News