Assembly Elections: రేపు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు... సర్వం సిద్ధం

  • దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం
  • మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో రేపు పోలింగ్
  • ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్
  • మే 2న ఓట్ల లెక్కింపు
Assembly elections in three states and one union territory

దేశంలో పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపు ఏప్రిల్ 6న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు, అసోం, బెంగాల్‌లోనూ మలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులో ఈ ఎన్నికల కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి ఓ కూటమి కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమి.

అటు కమలహాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా బరిలో ఉన్నాయి. టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంఎంకే, డీఎండీకే, ఎస్పీడీఐ మరో కూటమిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

అటు, కేరళలోనూ తమిళనాడు తరహాలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉండగా, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ కూడా రేపు ఎన్నికలు జరుపుకుంటోంది. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐదు రిజర్వుడు స్థానాలు.

ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తి చేసుకున్న ఈశాన్య రాష్ట్రం అసోం, పశ్చిమ బెంగాల్‌లో రేపు మూడో విడత పోలింగ్ కు సిద్ధమైంది. అసోంలో ఈ విడతలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఆరు స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయగా 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

More Telugu News