ACB Report: దుర్గ గుడిలో సోదాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఏసీబీ

  • ఇటీవల విజయవాడ దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు
  • ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు సోదాలు
  • ఈవో సురేశ్ బాబు తప్పిదాలపై ఏసీబీ నివేదికలో వెల్లడి
  • తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని వివరణ
ACB submits report on searches in Vijayawada Durga Temple

ఇటీవల ఏసీబీ అధికారులు విజయవాడ కనకదుర్గ ఆలయంలో వరుసగా కొన్నిరోజుల పాటు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సోదాలపై నివేదికను ఏసీబీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిపిన సోదాల వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. దుర్గ గుడి ఈవో సురేశ్ బాబు తప్పిదాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈవో సురేశ్ బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డాడంటూ అందులో వివరించారు.

దేవాదాయ కమిషనర్ ఆదేశాలను ఈవో బేఖాతరు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రీ ఆడిట్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఈవో చెల్లింపులు చేశారని వెల్లడించారు. టెండర్లు, కొటేషన్లు, సామగ్రి కొనుగోళ్ల కోసం ఈవో చెల్లింపులు జరిపినట్టు వివరించారు. ఈ చెల్లింపులు డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ మార్గదర్శకాలకు విరుద్ధమని ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కట్టబెట్టారని తెలిపారు. టెండర్ల కేటాయింపుల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు పాటించలేదని స్పష్టం చేశారు.

More Telugu News