నమాజ్ వినిపించడంతో ఎన్నికల ప్రసంగం నిలిపివేసిన నారా లోకేశ్... వీడియో ఇదిగో!

04-04-2021 Sun 21:31
  • తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
  • టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ
  • పనబాక తరఫున లోకేశ్ ప్రచారం
  • సత్యవేడులో రోడ్ షో
Nara Lokesh stops his speech while Namaz in Sathyavedu

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున నారా లోకేశ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సత్యవేడులో రోడ్ షో నిర్వహించారు. అయితే లోకేశ్ ప్రసంగిస్తుండగా అక్కడికి సమీపంలోని మసీదు నుంచి నమాజ్ వినిపించింది. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. కార్యకర్తలు నినాదాలు చేస్తుండడంతో నమాజ్ వినిపిస్తోంది, నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. నమాజ్ పూర్తయ్యేవరకు ఆయన మౌనంగా ఉండడమే కాకుండా కార్యకర్తలను కూడా వారించారు.

కాగా, తన ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. పనికిమాలినోళ్లను గుంపుగా పార్లమెంటుకు పంపినా ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలే ఉన్నా రాష్ట్ర సమస్యలపై నిత్యం పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడే పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని, తద్వారా ఆకాశంలో ఉన్న జగన్ ని భూమ్మీదకు తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు లోకేశ్ వెల్లడించారు.