AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై 14 రోజుల పాటు కొనసాగిన విచారణ పూర్తి

  • ఏబీ వెంకటేశ్వర్లుపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ
  • తన వాదనలు వినిపించిన ఏబీ
  • నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ఇంతకాలం పట్టిందని వెల్లడి
  • నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణ
  • వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానన్న ఏబీ
  • వివేకా హత్య అంశం కూడా ప్రస్తావన
Inquiry concludes on AB Venkateswararao

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ నేటితో ముగిసింది. ఏబీపై వచ్చిన ఆరోపణల పట్ల గత 14 రోజులుగా విచారణ జరిగింది. విచారణ పూర్తయిన అనంతరం ఏబీ మీడియాతో మాట్లాడుతూ, అల్పులు, అథములు, కుక్క మూతి పిందెలు చేసిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవడానికి ఇంతకాలం పట్టిందని అన్నారు. ఓవైపు తాను విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే నకిలీ పత్రాలు సృష్టించారని, వాటిపై తాను తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

తన వాదనలను ఎంక్వైరీస్ కమిషనర్ సావధానంగా విన్నారని, వాస్తవాలు పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన వాదనలకు అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టుకు రుణపడి ఉంటానని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగిందని ప్రచారం చేసినవాళ్లే, తనపై దేశద్రోహం ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఏబీ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News