పవన్ కల్యాణ్ తన కాల్షీట్ కు పూర్తి న్యాయం చేశాడు: పేర్ని నాని వ్యంగ్యం

04-04-2021 Sun 16:08
  • తిరుపతిలో నిన్న పవన్ కల్యాణ్ సభ
  • టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమం అంటూ నాని వ్యాఖ్యలు
  • పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యాడని విమర్శలు
  • అజ్ఞాతవాసే కాదు అజ్ఞానవాసి కూడా అని వెల్లడి
Perni Nani said Pawan Kalyan fulfilled his call sheet

ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ నాయుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో పవన్ పాల్గొన్న బీజేపీ-జనసేన ప్రచార సభను ఉద్దేశించి పేర్ని నాని స్పందిస్తూ.... టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ రక్తి కట్టించాడని, తన కాల్షీట్ కు న్యాయం చేశాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఓ అద్దె మైకులా తయారయ్యారని విమర్శించారు.

ఉత్తరాది బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తోందని నాడు విమర్శించిన పవన్ కల్యాణ్... నేడు అదే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ ను పారదోలాలని పిలుపునిచ్చావ్... 2019లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు అన్నావ్... పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్నావ్.. ఇప్పుడేంటి రంకెలేస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అసలు ఆ కేసు విచారణ ఏ దశలో ఉందో తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ నేరుగా కేంద్ర హోంమంత్రి అధీనంలో పనిచేస్తుందన్న విషయం తెలియదా? అని అన్నారు. పవన్ అజ్ఞాతవాసే అనుకున్నాం, కానీ అజ్ఞానవాసి అని ఇప్పుడు తెలుస్తోంది అని విమర్శించారు.