రవితేజ కామెడీ ఎంటర్టైనర్ కి ముహూర్తం ఖాయమైనట్టే!

03-04-2021 Sat 19:30
  • 'క్రాక్'తో దక్కిన భారీ హిట్
  • షూటింగు దశలో 'ఖిలాడీ'
  • వచ్చేనెలలో కొత్త ప్రాజెక్టుతో సెట్స్ పైకి      
Trinatha Rao nakkina is doing his next movie with Raviteja

'క్రాక్' సినిమాకి ముందు రవితేజకి హిట్ లేక చాలా కాలమైంది. దాంతో ఆయనతో పాటు అభిమానులు కూడా డీలాపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి 'క్రాక్' సినిమా పడింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ వెంటనే ఆయన 'ఖిలాడి' సినిమాను పట్టాలెక్కించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం విశేషం.


ఇక 'ఖిలాడి' తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత వాళ్లు ఆ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. త్రినాథరావు నక్కిన నుంచి 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' వంటి సూపర్ హిట్లు ఉండటంతో, అందరిలోను ఈ ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది. వచ్చేనెలలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే డేట్ ఎనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది.