అమెరికా క్యాపిటల్​ హిల్​ పై మరో దాడి.. స్పందించిన బైడెన్​, కమలా హ్యారిస్​

03-04-2021 Sat 11:54
  • కారుతో దూసుకొచ్చిన దుండగుడు
  • ఓ పోలీస్ అధికారి మృతి.. మరొకరికి గాయాలు
  • పోలీసులపై కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నం
  • నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
  • దాడి ఘటనతో గుండె పగిలినంత పనైందన్న బైడెన్
Officer killed suspect shot dead in US Capitol Attack

అమెరికా చట్టసభపై జనవరి 6న ట్రంప్ మద్దతుదారుల దాడి మరక మరువకముందే.. మరో ఘటన జరిగింది. శుక్రవారం ఓ దుండగుడు కారుతో క్యాపిటల్ హిల్ కాంప్లెక్స్ లోకి బారికేడ్లను ఢీకొడుతూ దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి మరణించారు. మరొకరు గాయపడ్డారు.


చనిపోయిన అధికారిని విలియం బిల్లీ ఈవాన్స్ గా అమెరికా క్యాపిటల్ పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం మామూలుగానే ఉందన్నారు. కారుతో దూసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు.

కారుతో ఢీకొట్టిన అనంతరం నిందితుడు కారులో నుంచి దిగి పోలీసు అధికారులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు కాల్చేశారు. గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని నోవా గ్రీన్ (25)గా గుర్తించారు.

‘నేషన్ ఆఫ్ ఇస్లామ్’కు అతడు పెద్ద ఫాలోవర్ అని, అయితే, క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి మాత్రం ఉగ్రవాద దాడి కాదని పోలీసులు చెప్పారు. అతడికి ఉద్యోగం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్నాడని అంటున్నారు. కాగా, ఘటనతో క్యాపిటల్ హిల్ ను అధికారులు మూసేశారు.

ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. అమెరికా క్యాపిటల్ భవనం దగ్గర జరిగిన దాడి తెలిసి గుండె పగిలినంత పనైందని బైడెన్ అన్నారు. ఘటనలో చనిపోయిన పోలీస్ అధికారి ఈవాన్స్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. దారుణ హింసాత్మక దాడిలో ధీశాలి అయిన విలియమ్ ఈవాన్స్ ను పోగొట్టుకోవడం విచారకరమని కమలా హ్యారిస్ అన్నారు.

క్యాపిటల్ ను రక్షించేందుకు ఈవాన్స్ తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. దాడిపై క్యాపిటల్ పోలీస్, నేషనల్ గార్డ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా వేగంగా స్పందించాయని పేర్కొన్నారు. క్యాపిటల్ హిల్ ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న అధికారులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.