శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ కుటుంబం దుర్మరణం

03-04-2021 Sat 09:32
  • నిడమనూరు వద్ద ప్రమాదం
  • టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ
  • బైక్‌పైకి దూసుకెళ్లిన టాటా ఏస్
  • పరారీలో లారీ డ్రైవర్
Sarpanch family killed in an Accident held Nalgonda dist

నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ కుటుంబం మృత్యువాత పడింది. పోలీసుల కథనం ప్రకారం.. బియ్యం లోడుతో మిర్యాలగూడ నుంచి వస్తున్న లారీ నిడమనూరు వద్ద అదుపుతప్పి ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి వెనకే వస్తున్న బైక్‌పైకి టాటా ఏస్ దూసుకెళ్లింది.

దీంతో బైక్‌పై ఉన్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఐదేళ్ల వారి కుమార్తె శ్రీవిద్య, మూడేళ్ల కుమారుడు కన్నయ్య, టాటా ఏస్‌లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ, సర్పంచ్ పిల్లలు ఇద్దరూ మృతి చెందారు.

తన భార్య విజయ పుట్టింట్లో శుభకార్యం ఉండడంతో ముప్పరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.