షావోలిన్ ఫైటర్ తో పవన్ కల్యాణ్ సాధన... ఫొటోలు ఇవిగో!

02-04-2021 Fri 14:52
  • క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న పవన్
  • హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్
  • పవన్ పై ఫైటింగ్ సీక్వెన్స్ ల చిత్రీకరణ
  • పవన్ కోసం సెట్స్ పైకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు
Pawan Kalyan trained with a Shaolin fighter on the sets of Harihara Veeramallu

ఇటీవలే 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేసుకున్న టాలీవుడ్ అగ్రహీరో పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైటింగ్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పలు పోరాట రీతులను సాధన చేస్తున్నారు.

స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షణలో హర్ష్ వర్మ అనే షావోలిన్ యోధుడితో కలిసి బల్లెం ఉపయోగించి పోరాడడంపై శిక్షణ పొందుతున్నారు. సెట్స్ పైకి చాలా త్వరగా చేరుకునే పవన్ మేకప్ కంటే ముందే ఉదయం 7 గంటల నుంచి ఈ తరహా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.

ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ ఓ వజ్రాల దొంగగా కనిపిస్తాడని తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి ఇతివృత్తంతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇందులో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.