మంత్రి పేర్ని నాని ఒక కామెడీ పీస్: అయ్యన్నపాత్రుడు

02-04-2021 Fri 14:10
  • పుదుచ్చేరి అంశంలో అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు
  • పుదుచ్చేరికి హోదా ఇస్తామని బీజేపీ ప్రకటించిందని వెల్లడి
  • రాష్ట్రంలో రంకెలు వేయకుండా జగన్ ను నిలదీయాలని హితవు
  • ఏపీలో డ్రామా, పుదుచ్చేరిలో ప్రేమ కుదరదని స్పష్టీకరణ
Ayyanna Patrudu terms AP Minister Perni Nani a Comedy piece

టీడీపీ ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి పేర్ని నానిపై ధ్వజమెత్తారు. మంత్రి పేర్ని నాని ఒక కామెడీ పీస్ అంటూ అభివర్ణించారు. పుదుచ్చేరికి హోదా ప్రకటిస్తామని మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీపై రాష్ట్రంలో రంకెలు వేస్తున్నట్టు నటించడం కాకుండా, నేరుగా తాడేపల్లి వెళ్లి జగన్ ను నిలదీయాలని హితవు పలికారు.

బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలి అంటూ పుదుచ్చేరిలో వైసీపీ మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో ప్రశ్నించాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆర్టిస్ట్ నానీ... ఏపీలో డ్రామా, పుదుచ్చేరిలో ప్రేమ అంటూ కుదరదు అని స్పష్టం చేశారు.

పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చిందని టీడీపీ అంటుండగా, బీజేపీ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. పుదుచ్చేరికి హోదా ఇస్తామన్న బీజేపీకి ఎలా మద్దతు ప్రకటిస్తారంటూ టీడీపీ వర్గాలు వైసీపీ నేతలపై మండిపడుతున్నాయి.