kakumanu: కాకుమాను విద్యాలయ వజ్రోత్సవ వేడుక ప్రారంభం!

Kakumanu School 75 Annual Day Celebrations
  • కాకుమాను విద్యాలయ ఘనత
  • 75 వసంతాలు పూర్తి.. వజ్రోత్సవ వేడుకలు 
  • ముఖ్య అతిథిగా జస్టిస్ లావు నాగేశ్వరరావు రాక  
  • విద్యాలయ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు  
విద్యాలయాలు ఎంతోమంది విజ్ఞానవేత్తలను తయారు చేస్తాయి .. మరెంతో మంది మేధావులను సమాజానికి అందిస్తాయి. ఎవరెస్టు శిఖరం పునాదులు కూడా నేలపైనే ఉంటాయి. అలాగే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ల అభివృద్ధి సోపానాలు ఆ ఊరి పాఠశాల నుంచే మొదలవుతాయి. వాళ్లు సాధించిన విజయాల మూలాలు ఆ విద్యాలయం తరగతి గదుల్లోనే ఉంటాయి. అలాంటి విద్యాలయాలలో ఎంతో సుదీర్ఘమైన .. ఘనమైన చరిత్ర కలిగినదిగా గుంటూరు జిల్లా కాకుమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపిస్తుంది. ఎన్నో వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఈ విద్యాలయం 75 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా మే 1.. 2 తేదీలలో 'వజ్రోత్సవం' నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ వజ్రోత్సవ వేడుకలను గురువారం రోజున పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవిని పూజించి ప్రారంభించారు. పాఠశాల కమిటీవారు 'అవగాహన ప్రదర్శన' పేరుతో నిన్న చేపట్టిన ర్యాలీలో, పూర్వ విద్యార్థులు .. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

'మనందరి పలకరింత .. పాఠశాల పులకరింత' అనే నినాదంతో ముందుకుసాగారు. గ్రామం మధ్యలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు సమర్పించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులైన కారుమంచి ప్రసాద్ బాబు .. నల్లమోతు రత్తయ్య .. యార్లగడ్డ అంకమ్మ చౌదరి .. మామిళ్లపల్లి రాంగోపాల్ .. మంగమూరి మాధవి  తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  


kakumanu
Mangamuri Madhavi
Karumanchi Prasad Babu

More Telugu News