పిల్లలపై మామిడి తోట కాపలాదారుల కర్కశత్వం

02-04-2021 Fri 13:03
  • మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన
  • కుక్కను వెతుక్కుంటూ తోటలోకి వెళ్లిన చిన్నారులు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Mango gardeners Beat Children over suspicion of theft

వారంతా చిన్న పిల్లలు. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ వెతుకుతూ ఓ మామిడి తోటలోకి వెళ్లారు. అంతే, మామిడి కాయలు కోస్తున్నారని భావించిన తోట కాపలాదారులు.. ఆ చిన్నారులను పట్టుకుని కట్టేశారు. చింత బరిగెలు తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాదారు.

అంతేకాదు.. వారి నోట్లో బలవంతంగా పేడను కుక్కి తినిపించారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న బాధిత చిన్నారుల తల్లిదండ్రులు తొర్రూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొందరు స్థానిక నేతలు కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వారు సిబ్బందిని ఆదేశించారు. దీంతో పిల్లలను కొట్టి, పేడ తినిపించిన బొత్తల తండాకు చెందిన బానోత్ యాకు, హచ్చుతండాకు చెందిన బానోతు రాములుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.