వెంటనే సునీల్ కుటుంబానికి పరిహారంతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి: బండి సంజయ్​

02-04-2021 Fri 12:36
  • సునీల్ కుటుంబానికి పరామర్శ
  • సీఎంకు సోయి లేదని కామెంట్
  • చీమకుట్టినట్టయినా ఉండదని మండిపాటు
  • మంచి భవిష్యత్ ఉన్న తెలంగాణ కోసం ఇంకో ఉద్యమం
  • ఒక్క జెండాతోనే అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపు
Bandi Sanjay Fires On CM KCR

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సునీల్ కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారం పరామర్శించారు. చనిపోయే ముందు సీఎం కేసీఆర్ పేరును సునీల్ చెప్పాడని, వెంటనే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వ చేతగాని పాలనే కారణమని ఆరోపించారు. సునీల్ తండ్రి లేవలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సునీల్ కుటుంబానికి పరిహారంతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ కు సోయి ఉండదని, చీమకుట్టినట్టు కూడా ఉండదని అన్నారు. ఇలాంటి రాక్షసుడి కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని పిలుపునిచ్చారు. కష్టపడి చదువులు చదివించారని, వారి కలలను సాకారం చేయాలని సూచించారు.

మంచి భవిష్యత్ ఉన్న తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు, సంఘాలు ఏకమై ఒక్కటే జెండాపై ఉద్యమం చేద్దామన్నారు. తనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. సునీల్ మరణ వార్త కలచివేసిందన్నారు. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా వారి కన్నుగప్పి.. సునీల్ మృతదేహాన్ని ఆగమాగంగా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ఎవరూ రారని, కనీసం కుటుంబానికి భరోసా కూడా కల్పించట్లేదని మండిపడ్డారు.