ప్రైవేటీకరణ ఆందోళనల వేళ.. నాలుగు నెలల్లో రూ. 740 కోట్ల లాభాలు ఆర్జించిన విశాఖ ఉక్కు

02-04-2021 Fri 09:40
  • ఈ ఏడాది అమ్మకాల్లో 13 శాతం వృద్ది
  • సామర్థ్యానికి మించి ఉత్పత్తి
  • స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం
  • మార్చిలో 7,11,000 టన్నుల అమ్మకాలు
  • గత నెలలో రూ.3,300 కోట్ల ఆదాయం
Vizag Steel Plant Creates New Record in Net Profit

ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఆందోళనలు జరుగుతున్న వేళ వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ రికార్డు సృష్టించింది.  గత నాలుగు నెలల్లో ఏకంగా రూ. 740 కోట్ల నిరక లాభాన్ని ఆర్జించింది. ఆ సంస్థ సీఎండీ పీకే రథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించినట్టు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 13 శాతం అధికమన్నారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులని, కానీ ఈ ఏడాది అంతకుమించిన ఉత్పత్తి జరిగిందని తెలిపారు. విదేశాలకు 13 లక్షల టన్నులు ఎగుమతి చేశామని,  అంతకుముందుతో పోలిస్తే ఇది 261 శాతం అధికమని వివరించారు.

ఈ ఏడాది అమ్మకాల్లో 13 శాతం వృద్ది సాధించామని, గత నెలలోనే ఏకంగా 7,11,000 టన్నుల అమ్మకాలతో రూ.3,300 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే ఇదో రికార్డు అని చెప్పుకొచ్చారు. గతేడాది ఇదే సమయంలో రూ. 2,329 కోట్లు ఆర్జించినట్టు చెప్పారు. అలాగే, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏడాదిలో దాదాపు 10 కోట్ల రూపాయలు, పీఎం కేర్స్‌కు 5 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు.