జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించిన రష్యా ప్రతిపక్ష నేత.. జైలు సిబ్బంది వేధిస్తున్నారంటూ లేఖ

02-04-2021 Fri 07:51
  • ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్
  • విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
Russia Opposition leader Alexei Navalny Started Hunger Strike in jail

ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్ట్ అయి జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో నిరాహార దీక్షకు దిగారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనను జైలు అధికారులు వేధిస్తున్నారని, తనకు సరైన వైద్యం కూడా అందించడం లేదంటూ జైలు అధికారికి అలెక్సీ లేఖ రాశారు.

 రాత్రి వేళ గంటకోసారి తనను నిద్రలేపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు. తనకు చికిత్స అందించేందుకు ఓ నిపుణుడిని పంపాలని కోరి వారం గడుస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరాహార దీక్షకు దిగినట్టు తెలిపారు.

మరోవైపు, ఆయన విడుదల కోసం రష్యాలో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. అలెక్సీని విడుదల చేయాలంటూ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. యూనివర్సిటీల విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.