దూకుడు చూపించే మాస్ పోలీస్ ఆఫీసర్ గా రామ్!

01-04-2021 Thu 18:06

  • 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ఇమేజ్
  • 'రెడ్'తో ఫ్లాప్ అందుకున్న రామ్
  • లింగుస్వామితో తాజా చిత్రం

Ram will be seen as a powerful police officer

రామ్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. తెరపై పాలబుగ్గల పసివాడిగా కనిపిస్తాడు గనుక, చాక్లెట్ బాయ్ అనే పేరు వచ్చేసింది. అమ్మాయిల్లో ఆయనకి అభిమానులు పెరిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకి గల ఇమేజ్ లో నుంచి బయటపడటానికి కొత్తగా ఏదైనా చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు. అలాంటి సమయంలోనే ఆయనకి పూరి నుంచి పిలుపు వచ్చింది. ఆ ఇద్దరి కాంబినేషన్లో 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, రామ్ కి మాస్ ఆడియన్స్ నుంచి మద్దతును కూడగట్టింది. మాస్ కంటెంట్ ఉన్న పాత్రల్లోను రామ్ దుమ్మురేపేయగలడని చాటిచెప్పింది.

ఆ తరువాత రామ్ చేసిన 'రెడ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడుగానీ, కథాపరంగా కలిసిరాలేదు. దాంతో మళ్లీ వెంటనే మరో హిట్ కొట్టవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఈ నేపథ్యంలో ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ దూడుకుమీద ఉండే మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇంతవరకూ రామ్ ఈ తరహా పాత్ర చేయకపోవడం, ఆయన అభిమానుల్లో హుషారును పెంచే అంశం. తెరపై మాస్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడనేది చూడాలి మరి.