Bobby Deol: బాబీ డియోల్‌కు కరోనా గురించి 1997లోనే తెలుసట.. ఇదిగో మీరే చూడండి ఎలాగో..!

  • నెట్టింట్లో వైరల్‌గా మారిన ఐశ్వర్య, బాబీ స్వాబ్‌ టెస్ట్‌ చిత్రం
  • కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఉన్న సన్నివేశాల్ని కూడగట్టిన నెటిజన్లు
  • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి లార్డ్‌ బాబీ అంటూ కామెంట్లు
  • నవ్వు పుట్టిస్తున్న మీమ్‌లు
Bobby deol knows Coronavirus in 1997 itself

2019 ఆఖరులో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని ఇప్పటికీ కలవరపెడుతోంది. ప్రజలు ఇప్పటికీ కఠిన నిబంధనల మధ్య కలం వెళ్లదీయాల్సి వస్తోంది. సామాజిక దూరం, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం, మాస్కులు ధరించడం ఇప్పుడు సాధారణమైపోయాయి. అయితే, ఇవన్నీ మనం 2019లో కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి పాటిస్తున్నాం.

కానీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌కి మాత్రం కరోనా గురించి 1997లోనే తెలుసు! అప్పట్లోనే ఆయన సామాజిక దూరం పాటించాడు. మాస్కు ధరించాడు. చేతులు తరచూ శుభ్రం చేసుకున్నాడు. అందాల సుందరి ఐశ్వర్యరాయ్‌కి అప్పట్లోనే ఆర్‌టీపీసీర్‌ పరీక్ష చేశాడు. పైగా మీకెవరికీ తెలియని విషయాలు నాకొక్కడికే తెలుసంటూ అప్పుడే ఓ సంకేతం కూడా ఇచ్చాడు! ఇదేంటి.. శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టంది బాబీ డియోల్‌కి ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నారా? ఇదంతా అప్పట్లో వచ్చిన సినిమాలలోని సన్నివేశాలులెండి.

అయితే, తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉన్న బాబీ డియోల్‌ సినిమాల్లోని క్లిప్పింగ్స్‌ను కట్‌ చేసి నెటిజన్లు ఆన్‌లైన్‌లో నవ్వు పుట్టిస్తున్నారు. 1997లో వచ్చిన ‘ఔర్‌ ప్యార్‌ హో గయా’ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ని ఆటపట్టించే క్రమంలో బాబీ డియోల్‌ ఆమెకు తుమ్ము తెప్పించేందుకు స్వాబ్‌ టెస్టు చేస్తున్న రీతిలో దానిని ఐశ్వర్య ముక్కులో దూర్చే ప్రయత్నం చేస్తాడు. అది ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో ముక్కులో పెట్టే స్వాబ్‌ లాగే ఉండడంతో బాబీ డియోల్‌ అప్పట్లోనే కరోనా పరీక్ష చేస్తున్నారంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

1999లో తన సోదరుడు సన్నీ డియోల్‌తో కలిసి నటించిన ఓ సినిమాలో బాబీ డియోల్‌ ‘‘నన్ను ముట్టుకోవద్దు. నాకూ వ్యాధి సోకుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నా’’ అంటూ చేసే వ్యాఖ్యలు కూడా సరిగ్గా ఇప్పటి పరిస్థితులకు సరిపోలేలా ఉన్నాయి.

ఇలా ఆయన డాక్టర్‌ పాత్రలో మాస్క్‌ ధరించడం, చేతుల్ని శుభ్రం చేసుకోవడం వంటి అనేక సన్నివేశాల్ని కూడగట్టి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. లార్డ్‌ బాబీకి ఇవన్నీ ముందే తెలుసు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆ క్లిప్పింగులన్నీ చూస్తే బాబీ డియోల్‌కి నిజంగానే కరోనా గురించి ముందే తెలుసా? అన్న అనుమానం రాక తప్పదు. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ మీమ్‌లను మీరూ మీ మొబైల్‌ ఫోన్లలో చూసేయండి మరి.

More Telugu News