Mamata Banerjee: నరేంద్ర మోదీ వీసాను రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్!

  • బంగ్లాదేశ్ లో పర్యటించిన మోదీ
  • ఓ వర్గం ప్రజలను ప్రభావితం చేయాలని చూశారు
  • ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మమతా బెనర్జీ
Mamata Demands for Modi Visa Cancel

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ తన కార్యకలాపాల ద్వారా పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. "బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆయన బంగ్లాదేశ్ కు వెళ్లి, బెంగాల్ పై ప్రసంగాలు చేస్తున్నారు.ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి వ్యతిరేకమైన చర్య" అని మమత ఖరగ్ పూర్ లో జరిగిన ఓ ప్రచార సభలో ఆరోపించారు.

"2019లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఓ బంగ్లాదేశ్ నటుడు మా ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చారు. ఆ వెంటనే బంగ్లాదేశ్ తో మాట్లాడిన బీజేపీ నేతలు ఆయన వీసాను రద్దు చేయించారు. ఇప్పుడు బెంగాల్ లో ఎన్నికలు జరుగుతుంటే, మీరు (ప్రధాని) బంగ్లాదేశ్ కు వెళ్లి, ఓ వర్గం ప్రజల ఓట్లను ప్రజల ఓట్లను ప్రభావితం చేసేలా మాట్లాడారు. ఆయన వీసాను ఎందుకు రద్దు చేయరు?.ఈ విషయంలో మేము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నాం" అని మమత వెల్లడించారు.

బంగ్లాదేశ్ లోని ఓరాకాండీలో ఉన్న హిందూ దేవాలయంలో మోదీ పూజలు చేయడాన్ని ప్రస్తావించిన ఆమె, ఆయన అక్కడికి వెళ్లి కూడా ఎన్నికల ప్రచారం చేశారని, మతువా వర్గం ఓటర్లను ఆయన ప్రభావితం చేయాలని చూశారని మమత ఆరోపించారు. ప్రస్తుతం మతువా వర్గం ప్రజలు లక్షలాది మంది పశ్చిమ బెంగాల్ లో నివాసం ఉంటూ, ఈ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడిన మోదీ, భవిష్యత్తులో ఒరాకాండీ నుంచి ఇండియాకు రాకపోకలను సులువు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది.

More Telugu News