Myanmar: మయన్మార్‌లో సైన్యం కాల్పుల్లో ఒక్కరోజే 91 మంది మృతి

  • రోజురోజుకీ హద్దులు మీరుతున్న సైనిక ప్రభుత్వం
  • ప్రజాస్వామ్య అనుకూలవాదులపై విచక్షణారహిత కాల్పులు
  • ఫిబ్రవరిలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సైన్యం
  • ఇప్పటి వరకు 419 మంది మృత్యువాత
91 Killed in Myanmar army firing

మయన్మార్‌లో సైనిక పాలన రోజురోజుకీ హద్దులు మీరుతోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే నియంత ఆదేశాల మేరకు అక్కడి సైన్యం రెచ్చిపోయింది. ప్రజాస్వామ్య పాలన కోసం పోరాటం చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనల్లో కనీసం 91 మంది చనిపోయి ఉంటారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. యంగూన్, మాండలే, నేపిడా తదితర నగరాలు, పట్టణాల్లో శనివారం నిరసనకారులు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు.

మయన్మార్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సైన్యం దేశపాలనను తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ప్రజా నిరసనలను అణిచివేస్తున్న మయన్మార్‌ సైన్యం.. కాల్పులకు తెగబడుతోంది. అప్పట్నుంచి జరుగుతున్న వేర్వేరు ఘటనల్లో భద్రతాదళాల కాల్పుల్లో ఇప్పటివరకు 419 మంది మృతిచెందినట్టు సమాచారం.

మయన్మార్‌ 76వ సాయుధ దళాల దినోత్సవం బీభత్సానికి, అవమానానికి వేదికగా నిలిచిందని యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధి బృందం ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారులతో పాటు నిరాయుధులైన పౌరులను చంపడాన్ని ఖండించింది.

More Telugu News