Maharashtra: 80 శాతం కొత్త కేసులు ఆరు రాష్ట్రాల్లోనే.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం

  • కొత్తగా 62,258 కేసులు నమోదు
  • ఒక్క మహారాష్ట్రలోనే 36,902 కేసులు
  • దేశంలో ప్రస్తుతం 4,52,647 యాక్టివ్ కేసులు
  • కరోనాతో కొత్తగా 291 మంది మరణం
80pc of new Covid19 cases only in 6 states

దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 62,258 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో 80 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే వెలుగులోకి రావడం గమనార్హం.

మహారాష్ట్రలో ఒక్కరోజే 36,902 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పంజాబ్‌లో 3,122 కేసులు, ఛత్తీస్‌గఢ్‌లో 2,665 కేసులు, కర్ణాటకలో 2,566 కేసులు, గుజరాత్‌లో 2,190 కేసులు, మధ్యప్రదేశ్‌లో 2,091 కేసులు  వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే వైరస్ విజృంభణ అధికంగా ఉన్నట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో ప్రస్తుతం 4,52,647 (3.8 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 73 శాతం కేసులు.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా శుక్రవారం-శనివారం మధ్య 291 మంది కరోనాతో మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య 112గా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే తాజాగా 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. అసోం, ఒడిశా, పుదుచ్చేరి, లడఖ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అండమాన్ నికోబార్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 12లక్షల మందికి పైగా కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 30,386 మంది వైరస్ నుంచి కోలుకున్నారని.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య 17,019గా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే రికవరీ రేటు(94.84శాతం) పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News