Adimulapu Suresh: కరోనాపై పాఠశాలలు, కాలేజీలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రం
  • విద్యాసంస్థల్లోనూ కరోనా కలకలం
  • అనేక రాష్ట్రాల్లో మూతపడ్డ కాలేజీలు, స్కూళ్లు
  • ఏపీలో పూర్తిస్థాయిలో క్లాసులు జరుగుతున్నాయన్న మంత్రి
  • కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలు మూసేయాలని ఆదేశం
AP Education minister Adimulapu Suresh video conference over covid situations in schools and colleges

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరోసారి కనిపిస్తున్న వేళ అనేక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఏపీలోనూ పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. రాజమండ్రిలో ఓ కాలేజీలో 168 మంది కరోనా బారినపడిన నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, నిర్వాహకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. కరోనాపై నిర్లక్ష్యం వహించే పాఠశాలలు, కాలేజీలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలని అన్నారు.

ఏపీలో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ రెండు నెలలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు మరింత అధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేపడతామని, కరోనా సోకిన వారిని గుర్తించి, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోందని, దేశంలోనే అత్యధిక టెస్టులు చేసింది ఏపీలోనే అని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News