హిందీనా..?: ఏఆర్ రెహ్మాన్ షాకింగ్ కామెంట్.. వీడియో వైరల్
- 99 సాంగ్స్ ఆడియో ఈవెంట్ లో వ్యాఖ్యలు
- రెహ్మాన్ ను తమిళంలో.. హీరోను హిందీలో ఆహ్వానించిన వ్యాఖ్యాత
- వైరల్ గా మారిన రెహ్మాన్ కామెంట్లు
కార్యక్రమం సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ ను వ్యాఖ్యాత వేదికపైకి ఆహ్వానించారు. అయితే, అప్పుడు ఆమె తమిళంలో మాట్లాడారు. కానీ, ఆ తర్వాత హీరో ఎహాన్ భట్ ను పిలిచేటప్పుడు మాత్రం భాష మార్చింది. హిందీలో మాట్లాడుతూ స్వాగతం పలికింది. ‘‘ఎహాన్ భట్ జీ చెన్నై మే ఆప్ కా హార్దిక్ స్వాగత్ కర్తీ హూ (ఎహాన్ భట్ గారూ.. చెన్నై మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది)’’ అంటూ వ్యాఖ్యానించింది.
దీంతో రెహ్మాన్ ఒక్కసారిగా ‘హిందీనా’ అంటూ యాంకర్ వైపు చూశారు. నవ్వుకుంటూ వేదికి దిగుతున్న ఆయన ఒక్కసారి ఆగి.. ‘‘ఇంతకుముందే కదా, మీరు తమిళ్ లో మాట్లాడినట్టున్నారు’’ అనుకుంటూ వెళ్లిపోయారు. దానికి సంంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. కాగా, 99 సాంగ్స్ సినిమాకు రెహ్మాన్ కూడా కథా సహకారం అందించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘వైఎం మూవీస్’ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.