Talasani: మొబైల్ ఫిష్ ఔట్ లెట్ల ద్వారా నాణ్యమైన చేపల అమ్మకం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Will sell quality fish from Mobile Outlets says Talasani
  • కులవృత్తులకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
  • మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు మొబైల్ వాహనాలు ఇస్తున్నాం
  • జనం ఉన్న చోట వాహనాన్ని ఆపి చేపలు అమ్ముకోవచ్చు
మన దేశానికి కులవృత్తులు అత్యంత ముఖ్యమైనవని... కోట్లాది మంది తమ కులవృత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. గత ప్రభుత్వాలన్నీ కులవృత్తులను విస్మరించాయని అన్నారు. దేశంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లను మంత్రులు హరీశ్ రావు, తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్క మత్స్యకారుడు ఖాళీగా ఉండకుండా వారికి ఉపాధి కల్పిస్తున్నామని తలసాని అన్నారు. ఉమ్మడి ఏపీలో మత్స్యశాఖకు రూ. 10 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని... ప్రస్తుతం ఆ బడ్జెట్ ను రూ. 100 కోట్లకు పెంచామని చెప్పారు. ఫిష్ మొబైల్ ఔట్ లెట్లలో నాణ్యమైన చేపలను అందిస్తామని... జనం ఉన్నచోట మొబైల్ వెహికల్స్ ను ఆపి, చేపలను అమ్ముకోవచ్చని తెలిపారు. రూ. 10 లక్షల విలువ చేసే ఈ మొబైల్ వాహనాలను మహిళలకు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 500 మొబైల్ ఫిష్ ఔట్ లెట్లను అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 25 వేల మత్స్యకారులకు ఉచితంగా ద్విచక్రవాహనాలను ఇచ్చామని చెప్పారు.
Talasani
KCR
TRS
Mobile Fish Outlets

More Telugu News