BJP: నువ్వసలు కమిషనర్‌వేనా?.. మైసూరు సీపీపై బీజేపీ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు

  • ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో ఓ బైకర్ మృతి
  • ఆగ్రహంతో పోలీసులను చితకబాదిన స్థానికులు
  • పోలీసులను మెచ్చుకుని ప్రశంసాపత్రాలు ఇచ్చిన సీపీ
  • ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్న బీజీపీ ఎమ్మెల్సీ
BJP MLC Vishwanath lashes out at karnatak traffic police

మైసూరులోని రింగు రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు ఓ బైకర్‌ను ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అతడు కిందపడి మరణించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులను చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత పోలీసులపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దాడికి గురైన పోలీసులను అభినందించిన పోలీసు కమిషనర్ డాక్టర్ చంద్రగుప్త వారికి ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు.

అయితే, పోలీసులకు ప్రశంసాపత్రాలు ఇవ్వడంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మరణిస్తే వారికి ప్రశంసాపత్రాలు ఇవ్వడమేంటని నిలదీశారు.

‘‘నువ్వు కమిషనర్‌వా?, థూ.. నీ జన్మకు సిగ్గుండాలి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీపీగా ఉన్నప్పటికీ నగరంలో ఏం జరుగుతోందో ఆయనకు తెలియదని ధ్వజమెత్తారు. ట్రాఫిక్ పోలీసులకు మైసూరులో ట్రాఫిక్ నియంత్రించడం రాదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని విశ్వనాథ్ తెలిపారు.

కాగా, బైకర్ మృతిలో పోలీసుల తప్పేమీ లేదని, ఓ ట్రక్ వారి బైక్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు.

More Telugu News