Vijayasai Reddy: అందుకే కంటెంట్ ఉంటే కటౌట్ చాలనేది: విజయసాయిరెడ్డి విసుర్లు

  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై విజయసాయి విమర్శలు
  • సర్వీసులో ఉన్నంతకాలం అధికారంలో ఉన్నవారికి ఊడిగం చేశారని వ్యాఖ్య
  • సోనియాకు గులాంగిరి చేశారని విమర్శ
Vijayasai Reddy comments on JC Lakshminarayana

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించారు. స్వామి వివేకానందునిలా బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. సర్వీసులో ఉన్నంతకాలం అధికారంలో ఉన్నవారికి ఊడిగం చేశారని... సీబీఐ అధికారిగా సోనియాగాంధీకి గులాంగిరి చేశారని విమర్శించారు. ఇప్పడు వైజాగ్ స్టీల్ కాపాడతానని బయల్దేరారని ఎద్దేవా చేశారు. పోరాడాల్సిన చోట పోరాడడని, అడగాల్సిన వారిని అడగడని అన్నారు. ఉక్కు కోసం తెగిస్తానంటూ చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నాడని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో సోము వీర్రాజు, అచ్చెన్నాయుడులపై కూడా విజయసాయి విమర్శలు గుప్పించారు. తిరుపతి ఉపఎన్నిక ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం కాదని అంటున్నారని... ప్రచారం ప్రారంభం కాకముందే చేతులెత్తేస్తే ఎలాగని ప్రశ్నించారు. జగన్ గారి కటౌటే మిమ్మల్ని వణికిస్తోందా? అందుకే కంటెంట్ ఉంటే కటౌట్ చాలనేది అని వ్యాఖ్యానించారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై కూడా ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో పచ్చ కుల బాస్ చెప్పారని సుప్రీంకోర్టు వరకు వెళ్లి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పెట్టిన నిమ్మగడ్డ ఇప్పుడు ఏ అడ్డంకీ లేకపోయినా ఎందుకు సాకులు చెపుతున్నారని దుయ్యబట్టారు. కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి ఇప్పుడు ఆగిన ప్రక్రియను పూర్తిచేయలేరా? అని ప్రశ్నించారు. రిటైరయ్యాక ఎంపీటీసీగా పోటీ చేసినా నిమ్మగడ్డ గెలవలేరని ఎద్దేవా చేశారు.

More Telugu News