Sri Lanka: శ్రీలంకపై ఐరాస మానవ హక్కుల మండలిలో ఓటింగ్... భారత్ గైర్హాజరు 

  • తమిళులపై యుద్ధనేరాల నేపథ్యంలో తీర్మానం
  • జనవరి 27న నివేదిక సమర్పించిన ఐరాస హక్కుల కమిషన్
  • నివేదిక ఆధారంగా తీర్మానానికి రూపకల్పన
  • తటస్థ వైఖరి పాటించిన భారత్
  • ఈ తీర్మానం అన్యాయం అంటూ ఎలుగెత్తిన లంక
India avoided UNHRC voting on Sri Lanka rights record

శ్రీలంకలో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్చార్సీ)లో ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్ కు భారత్ గైర్హాజరైంది. భారత్ కాకుండా మరో 13 దేశాలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. శ్రీలంకలో గతంలో తమిళులపై జరిగిన యుద్ధ నేరాల నేపథ్యంలో ఈ తీర్మానం తీసుకువచ్చారు.

ఐరాస మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం జనవరి 27న సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్మానానికి రూపకల్పన చేశారు. శ్రీలంకలో బాధ్యతాయుత ధోరణి పునరుద్ధరణ, మానవ హక్కుల స్థాపన పేరిట ఈ తీర్మానాన్ని యూఎన్ హెచ్చార్సీలో ప్రవేశపెట్టారు. 47 సభ్యదేశాల్లో 22 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటేశాయి. 11 సభ్య దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి.

అయితే ఈ తీర్మానం అన్యాయం అని శ్రీలంక ఆక్రోశించింది. ఐరాస రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం అని ఆరోపించింది. కాగా, ఇదే అంశంలో శ్రీలంకకు 2012-2014 మధ్య కాలంలో ఐరాస మానవ హక్కుల మండలిలో మూడుసార్లు ప్రతికూల ఫలితం వచ్చింది.

More Telugu News